19, సెప్టెంబర్ 2017, మంగళవారం

కవిత్వ ప్రపంచం

రెండు పదాల మధ్య దోబూచులాడే నిశ్శబ్దమే కవిత్వం .
కవిత్వం తో నా తొలి ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైందో ఖచ్చితంగా చెప్పలేను . కానీ బహుశా గర్భస్ధ శిశువుగా ఉన్నప్పుడే మా అమ్మ గొంతెత్తి పాడిన విష్ణు సహస్ర నామాలను విని వుంటాను . పదే పదే వల్లే వేసిన పోతన మహా భాగవత పద్యాలను ఆకలింపు చేసుకుని వుంటాను . కొంచం ఊహ తెలిసిన తరువాత మా తాత గారు తన ప్రవృత్తి పరంగా పల్లెటూళ్లలో యువజనులకు భజనలు నేర్పడానికి పాడుకునే
రామదాసు కీర్తనలు విని ఉంటాను . తెలుగు ఉపాధ్యాయుడు గా మా నాన్న పరిచయం చేసిన మనుచరిత్ర లాంటి ప్రబంధాలను ఆశ్చర్య, అద్భుత భావాలు ముప్పిరి గొనగా చదివి వుంటాను . వీటన్నిటి మూలంగా ఒక కవిత్వ అభిరుచి లవ లేశ మాత్రం గా ఎదో నాలో నాటుకుని ఉంటుంది .
కవిత్వమంటే వట్టి మాటల కూర్పు కాదు అదొక మెరుపు అంటాడు ఖలీల్ జీబ్రాన్ . కవితా వ్యాసంగం సాయంకాలం కొండ మీదకు షికారుకు వెళ్లడం లాంటిది . కవితా ఖండం షికారులో అంతమయ్యే కొండపైని మహోన్నత శిఖరం . దాని చివర లోయ . లోయ లోకి కవి పడి పోకూడదు . అంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్ . కవిత్వం లో ప్రతి ధ్వనీ ప్రతి ధ్వనే అంటుంది అమృతా ప్రీతమ్ . అసంకల్పితం గా , అప్రయత్నం గా , అకస్మాత్తుగా పెల్లుబికే మానవ ఉద్వేగాలకు ప్రశాంత చిత్తం తో అక్షర రూపం ఇవ్వడమే కవిత్వం అంటాడు వర్డ్స్వర్త్ . నేను ఏదయినా చదివినప్పుడు నా శరీరమంతా మంచులా చల్లగా మారి ఈ అగ్నీ దానిని వెచ్చ చేయలేకుండా ఉంటుందో అదే కవిత్వం అన్నాడు ఎమిలీ డికిన్సన్ . శ్రీ కైవల్య పదంబు చేరుటకై చింతించెదను అంటాడు సహజ కవి బమ్మెర పోతనామాత్యుడు . తన కవిత్వాన్ని లోనారసి చూడ మంటాడు వాగనుశాసనుడు నన్నయ్య భట్టారకుడు
ఎవరు ఎన్ని విధాలుగా వర్ణించినా హృదయం లోకి వెళ్లి మనసును సంతృప్తి పరచి ఇదే కవిత్వం అనే నిర్వచనం ఎప్పటికీ అందదేమో. అందుకే . పాతికేళ్లుగా కవిత్వం రాస్తున్నా , చదువుతున్నా , కవిత్వం అంటే ఏమిటి అంటే ఒక్క మాటలో చెప్పలేను నేను. అది అనుభవైకవేద్యం . కవిత్వానికి నేను ఇచ్చే నిర్వచనం నాకు మాత్రమే పరిమితం . అది మరొకరికి సంతృప్తిని ఇవ్వదు . ఎంతమంది కవులు కవిత్వం రాస్తారో అన్ని నిర్వచనాలు ఉండి తీరతాయి . నా మటుకు నేను
రెండు పదాల మధ్య ఉన్న నిశ్శబ్దమే కవిత్వం అనుకుంటాను .
ఇన్నాళ్ల తరువాత నా సొంతంగానూ , మిత్రుల సలహా మీద , ఎన్ని పుస్తకాలు చదివినా పోతన మహాభాగవతమే నా అభిమాన కవిత్వ పుస్తకం . కవిత్వం సరళంగా , సౌందర్యవంతంగా , స్వచ్ఛ సుందర శుభ్ర స్ఫటికం లా ఉండాలనే భావన నాలో మొలకెత్తి , మహా వృక్షంగా మారడానికి మహా భాగవతమే కారణం .
లలిత స్కంధము , కృష్ణమూలము , శుకాలాపాభిరామంబు , మం
జులతా శోభితమున్ , సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు. మహాఫలంబు. విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్ద్విజశ్రేయమై
ఈ పద్యం లో కనిపించే కల్పతరువు భాగవతం అనే కల్పతరువు కాదు . కవిత్వమనే కల్పతరువు అని నా నమ్మకం . ఈ కల్పతరువు మీద వాలిన చిలుకల కలకలా రావములు మనోహరములై మన మనస్సులకు ఎలా ఆనందాన్ని , ఆహ్లాదాన్ని కలుగ చేస్తాయో , కవిత్వ శుకముల కలకలా రావములు కూడా మన మనసులకు అదే ఆనందాన్ని కలిగిస్తాయి . ఒక్క సారి మనం కవిత్వ కల్పవృక్ష నీడ లోకి వెళ్లిన తరువాత దాని ఫలములు వెదజల్లే అమృత రస పానము చేస్తే మనము అజరామరులమే అవుతాము
భాగవతం లోని రుక్మిణీ కళ్యాణం ఘట్టం లో శ్రీ కృష్ణుని సౌందర్యాన్ని వివరించే పద్యం ఒకటి ఉంటుంది . నిజానికి స్త్రీ ని వర్ణించమంటే కవులు వొంటి మీద ఉన్న స్పృహను మరచి పోతారు . కానీ నయన మనోహరుడైన నల్లనయ్య సౌందర్యాన్ని వర్ణించడం లో పోతన తనను తాను మరచి పోయాడు . బహుశా ఈ పద్య సౌరభానికి దాసుడై పోయే కృష్ణ శాస్త్రి తన అన్వేషణ అనే కావ్య ఖండిక లో
ఇల్లు వదిలి
పల్లె వదిలి
సాము సడలిన పతి పరిశ్వంగం వదిలి
కృష్ణుడి కోసం బృందావనానికి పరుగులు తీశారని రాసి వుంటారు .
రుక్మిణిని వర్ణించేటప్పుడు అలీ నీలాలకను పూర్ణ చంద్రముఖిన్ అన్న పోతన కృష్ణుడిని వర్ణించేటప్పుడు చంద్రమండల ముఖున్ అన్నాడు . రుక్మిణి పూర్ణ చంద్రముఖి అయితే కృష్ణుడు చంద్రమండల ముఖుడు అట
తన పాత్రల పట్ల ఎంత ఏకాగ్రత , ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి పాత్ర చిత్రణలు సాధ్యం కాదు .
కవిత లో ఒక పదం పడవలసిన స్థానం లో పడక పోతే పదానికి వున్న అర్ధమే మారి పోయి రసాభాస అవుతుంది .
నిజానికి పోతన భాగవతం లోని ప్రతి పద్యమూ ఒక రసగుళికే . ఆ అంబుధి లోతు చూడగలిగిన వాడికి చూడగలిగినంత ఆనందం లభిస్తుంది . అంతేనా ?
లోకములు , లోకులు లోక పాలకులు, అందరూ కూడా అంతమైన పిమ్మట . అలోకమైన పెంజీకటి కవతల ఎవ్వడు ఏకైక పరం జ్యోతి రూపం లో నుండునో వారిని సేవింతును అని గజేంద్రుడు ప్రార్ధించినప్పుడు పెంజీకటి కవతల అనే పదబంధం విన్నాక , చదివాక మనసు పరి పరి విధముల పోతుంది .
వేదాహమేతం పురుషం మహాంతం
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్
అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినట్టు తమస్సుకు కు ఆవలి తీరాన ఆదిత్య వర్ణం లో ప్రకాశించే అనంత మహాపురుషుడిని నేను తెలుసుకో గలిగాను అని ఒక మహా ఋషి ఎలుగెత్తి చాటిన రీతి గుర్తుకు వస్తుంది .
ఎప్పటి శ్వేతాశ్వతరోపనిషత్తు , ఎప్పటి మహాభాగవతం ఎక్కడి సత్యాన్వేషణ ?
ఈ అన్వేషణ కి మనిషికి జవాబు దొరికిందా ? అతడి అసంతృప్తికి సాంత్వన లేపనం లభించిందా ? ఈ ప్రశ్నలకు జవాబు వెతకడం కోసమే సమస్త సాహిత్యమూ , కవిత్వమూ ప్రయత్నం చేస్తున్నది
శ్రీ కృష్ణుడి లీలా మానుష లీలల సమాహారం భాగవతం అనుకుంటాము కానీ అది మన భౌతిక , ఆధ్యాత్మిక ఆలోచనలను శుద్ధి (ప్యూరిఫై ) చేసే ఔషధం ,
పెంజీకటి కావల ఏమున్నదో అని అన్వేషించే రుషుల పరంపరను విస్మరించి డేరా సచ్చా సౌధా బాబాల పాదాల మీదకు వాలిపోయే స్థితి కి భారత ఆధ్యాత్మిక చైతన్యం ఎదిగిందంటే ఒకింత దుఃఖం నిలువెల్లా చుట్టూ ముట్టక మానదు
వాట్ ఏ ఫాల్ మై కంట్రీ మెన్ అని అనిపించక మానదు
ఒక కవిత కవి హృదయం నుండి పాఠకుడి హృదయం లోకి ప్రవేశించినప్పుడు అతడికి ఒక అద్భుతమైన దర్శనం , భావ సంచలనం కలిగి అతడు ఒక కొత్త రూపాన్ని ధరించాలి
కవి వాడ్రేవు చిన వీరభద్రుడు
ఒక కవిత నీ మైదానాల లోకి ప్రవేశించేటప్పుడు
చుట్టూ అడవి తుమ్మెదల ఉన్మత్త ఝంకారం
వెల్లువలా విరబూసిన మామిడి పూత దారులంతా
యువతుల తరుణ దేహాల మాదక సుగంధం
మొదటి సారి నాన్న నీతో సముద్రపుటొడ్డున దూర
దీపాలు చూపించి నౌకలు గుర్తుపట్టించినట్టు
కోకిల వినిపించే గాధాసప్తశతి గుర్తుగా , ధూళి
రహిత దిగంతపు మలుపులో కవితను పోల్చుకో
అంటారు
మహాభాగవతం లో ఎప్పుడు ఏ పద్యం చదివినా నాకు పై అనుభూతి కలిగి
నేను మరో నేను లా మిగిలి పోతాను
ఏ కవితకైనా ఇంతకంటే పరమార్ధం మరేదయినా ఉంటుందా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి