19, సెప్టెంబర్ 2017, మంగళవారం

కవిత్వ ప్రపంచం

ఇప్పటి తరానికీ కావాలి ఒక తృణ కంకణం
రాయప్రోలు మైలు రాయి 
అబ్బూరి చలివేందర
సౌభద్రుని ప్రణయ యాత్ర
చదవాలని తొందర
అన్నాడు శ్రీశ్రీ తన సిప్రాలి లో . శ్రీ శ్రీ లాగే నేను కూడా రాయప్రోలు తృణకంకణం చదవాలని తొందరపడ్డాను . నిజానికి రాయప్రోలు ను కవిత్వాన్ని నాకు పరిచయం చేసింది మా తెలుగు సర్ శ్రీ పి . నరసింహా రావు గారు . మా స్కూల్ డే వేడుకకి నా ఏడవతరగతి లో " ఏ దేశ మేగినా , ఎవ్వరెదురైనా " అనే దేశభక్తి గీతం నేర్పించారు . అప్పుడే గురజాడ" దేశమును ప్రేమించుమన్నా" , మహమ్మద్ ఇక్బాల్" సారె జహాఁ సి అచ్చా " రచయత ఎవరో తెలియదు కానీ హిందీ పాట " హమ్ హొంగే కామ్ యాబ్ " ఇంగ్లిష్ పాట " ఉయ్ షల్ ఓవర్ కమ్ " ఇలా చాలా దేశభక్తి గీతాలు మాకు నేర్పించారు . రాయప్రోలు " ఏ దేశ మేగినా " నా హృదయం లో కొలువుండి పోయింది .
గురజాడ వేసిన అభ్యదయ రహదారిని ముప్ఫయి ఏళ్ల పాటు విస్మరించిన తెలుగు కవిత్వం మళ్ళీ శ్రీశ్రీ రాక తోనే దారి లో పడిందని చాలామంది అభిప్రాయం . రాయప్రోలు , కృష్ణశాస్త్రి , నాయని , వేదుల , వెంకట పార్వతీశం కవులు ఇలా చాలా మంది భావకవిత్వం అనే పల్లకి మోసిన బోయీలు . శ్రీశ్రీ షాక్ ఇచ్చేంతటివరకు ఆ యాత్ర అలాగే కొనసాగింది . భావకవిత్వం లో కూడా రాయప్రోలు ది విభిన్నమైన డిక్షన్ . కృష్ణశాస్త్రి లాగా అతడు మరీ నిరాశా వాది కాదు . సంప్రదాయము , ఆధునికత కలగలసిన నవ్య సాంప్రదాయం అతనిది . అందుకేనేమో తెలియదు కానీ
డాక్టర్ అక్కిరాజు రామాపతి రావు గారు ఆధునిక తెలుగు కవితా రీతులకు గురజాడ అప్పారావు ఉషోదయమైతే , రాయప్రోలు సుబ్బారావు అరుణోదయమని చెప్పాలి అన్నారు . అంటే ఆయన ఇద్దరికీ సమాన ప్రాతినిథ్యం ఇచ్చారు .
గురజాడ సంప్రదాయం పూర్తిగా వదిలివేసి తన రచనలతో పూర్తిగా ఆధునికత వైపు దృష్టి సారిస్తే రాయప్రోలు సంప్రదాయాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా సంప్రదాయం లోనే ఒక నవీనత సాధించడానికి ప్రయత్నం చేశాడు . ఇది వాళ్ళ కవిత్వ రూపాలలో కూడా కనిపిస్తుంది . గురజాడ ముత్యాలసరాలు అనే కొత్త ఛందస్సు సృష్టించి ప్రజలకు తేలికగా అర్ధమయ్యే గేయాన్ని తన భావాలకు వాహికగా చేసుకుంటే , రాయప్రోలు అంత తేలికగా అర్ధమవని ఖండ కావ్యాలను ఆలంబనగా చేసుకున్నాడు . గురజాడ కథలు , నాటకాలు కూడా రాస్తే రాయప్రోలు వాటి జోలికి వెళ్ళలేదు . గమనించాల్సిన విషయం ఏమిటంటే గురజాడ రచనా జీవిత దాదాపు ముగింపుకి వచ్చినప్పుడు రాయప్రోలు సాహిత్య జీవితం మొదలు అయింది . గురజాడ కష్టపడి వేసిన రహదారిని కాదని రాయప్రోలు సొంత దారి వేసుకోవడం ఎందుకు అనే ప్రశ్నకు బహుశా సమాధానం ఎక్కడా దొరకదేమో
చిత్రం గా గురజాడ పూర్ణమ్మ ఆత్మహత్య చేసుకుంటే , రాయప్రోలు తృణకంకణం లో కథానాయకుడు ప్రేయసిని చివరకు సోదరిగా భావించడము అనే అతి పెద్ద అసాధ్యమైన , అనితరసాధ్యమైన నిర్ణయం తీసుకుని జీవితాన్ని నిలుపుకున్నాడు . ఈ సంక్లిష్టత ను అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమే .
పాశ్చాత్త్యా దేశాలలో వచ్చిన రొమాంటిసిజం అనే వాదాన్ని భావ కవిత్వం గా మలచి , అమలిన శృంగారం అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖండ కావ్యం తృణకంకణం . అమలిన శృంగారం సిద్ధాంతము ఎందుకు అంటే ధర్మ వ్యవస్థను కాపాడటానికి రాయప్రోలు పడిన శ్రమ అమలిన శృంగార పరి కల్పనం అని శ్రీమతి పి . యశోదా రెడ్డి అభిప్రాయపడ్డారు . తృణకంకణం గురించి చదవాలని తొందర పడ్డాను అన్నాను కదా
తృణకంకణం అంటే గడ్డి తో చేసిన తోరము అని అర్ధం . తేలికగా అర్ధమయ్యే భాష లో చెప్పాలి అంటే గ్రాస్ బ్రాస్లెట్ . కథ లో ఇప్పటి కళ్ళకి కొత్తదనము ఏదీ కనిపించదు . ఒక అందమైన అమ్మాయి . ఎంత అందమైనది అంటే
పదియు నారు వసంతముల్ వదలనట్టి
వయసు సొగసుందనం ఆమె మెయిని మెరయు అందగత్తె
ఒక అందమైన అబ్బాయి . ఎంత అందమైన అబ్బాయి అంటే
తేట వలపులు మొలకెత్తినది మొదలు చిర సమ్మేళన విశేష కాంక్షారక్తి తో ఉన్న తరుణ తనూ మోహనుడు
ఇద్దరూ ప్రేమలో తలా మునకులుగా మునిగిపోయారు . విధి కూడా తమను విడదీయలేదు అనుకున్నారు . రస రాజ్య శిఖరాల అధిరోహణమే తమ జీవన సాఫల్యం అనుకున్నారు . తమ ప్రేమకు చిహ్నం గా
భావ బంధంబు గా మణిబంధమందు
తొలుత గట్టే నొక పట్టు తోరము
కానీ విడదీయలేదు అని వాళ్ళు అనుకున్న విధి వారిని విడదీస్తుంది . ఆమె కు వేరొకరి తో వివాహం జరుగుతుంది . ఆ తరుణ తనూ మోహనుడు భగ్న ప్రేమికుడి ,గా ఆమె నే శ్వాసిస్తూ , ఆమెనే ధ్యానిస్తూ , జీవితం అంటే విరక్తి పెంచుకుంటాడు . సకల దుర్వ్యసనాలకు తనను తాను అర్పించుకుంటాడు . కొంతకాలమైన తరువాత
ఆమె తన పుట్టింటికి వస్తుంది . తన ప్రేమికుడి దురవస్థకు చలించి పోతుంది .
అతడిని మళ్ళీ సరిఅయిన మార్గం లో నడపాలి అనుకుంటుంది . వాళ్ళ సంకేత స్థలానికి చేరుకుంటుంది .
తన ప్రేమికుడి కి పరి పరి విధాలా కౌన్సిలింగ్ చేస్తుంది .
నా ప్రియ సఖి !, అనురూప గు
ణ ప్రతిమ ! ప్రసన్నశీల !నవనీత శిరీ
ష ప్రణయ మృదుల హృదయ !క
టా ప్రాణములుండ ఎటు విడంబడి సైతున్
అన్న ప్రేమికుడికి
వలపులె రహస్యములు, తద్విఫలదశలు ని
గూఢములు .తదర్థములును గోప్యములు వి
దగ్ధుల కనుభవైక వేద్యంబు లివియే
ఏల ప్రేమ గర్భ విమర్శ యిపుడు సఖుడా
అని జవాబు చెపుతుంది
ఇలా చాలా సేపు ఆమె అతడికి నచ్చ చెపుతుంది . నన్ను మర్చిపొమ్మని చెప్పటం లేదు . నామీద ఉన్న ప్రేమ భావనని సోదర ప్రేమ గా మల్చుకొమ్మని చెపుతుంది . సోదరిగా ఎప్పుడూ తను అతడితోనే వుంటాను అని చెపుతుంది . చివరకతడు
ఈ తృణకంకణంబు భరియింపుము నీ మణిబంధమందు , సం
ప్రీతిని అప్పుడప్పుడు వలపింపుల నెయ్యము జ్ఞప్తిగొన్న ప్రా
భాతికవేళ నీ ప్రణయ భాష్ప జలాంజలి నింత చల్లి యే
రీతిని వాడకుండా నలరింపు మిదె తుది వాంఛ సోదరీ
అంటాడు .
వలపు నశించియును ప్రేమ నిలువగలద
యేని కలనైన కలుషము గాని స్నేహ
మృదు మధు రసానుభూతిని పొదలి , మనము
నీడలట్టుల నైక్య మందెదముగాత
అని రాయప్రోలు ఆమె చేత చెప్పించి తృణకంకణం అనే ఖండ కావ్యం ముగిస్తాడు .
ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఒక ఐహిక ఆముష్మికాతీతమైన బంధాన్ని సృష్టించి దానికి అమలిన శృగారమనే పేరుపెట్టి ఒక కొత్త సిద్ధాంతాన్ని తెలుగు సాహిత్య లోకం లోకి ప్రవేశ పెట్టాడు . దాని నే పాశ్చాత్య ప్రపంచం లో ప్రాచుర్యం లో వున్నా ప్లేటోనిక్ లవ్ తో ముడి పెట్టి రెండూ ఒకటే అన్నారు మన విమర్శకులు .
ఎందుకో తెలియదు కానీ నాకు ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గుర్తుకు వస్తున్నాడు .
మనము ఏదయినా ఒక దాని గురించి మాట్లాడుతున్నాము అంటే మన ఆలోచనలని , మన అనుభూతులను దానిలో వాటిని ఆరోపిస్తున్నాము అన్న మాట. ఈ ఆరోపణలు ఏవీ లేని , ఏ ఇతరేతర అంశాలు ఒక దాని మీద ఓవర్ లాప్ కానీ అంశాన్ని అంశం గా మాత్రమే చూడాలి . అప్పుడు మాత్రమే దాని నిజ స్వరూపం మనకు అర్ధం అవుతుంది .మనం దేనికైనా ఒక పేరు ఇస్తున్నాము అంటే దానిని ఆ పేరు తో గుర్తిస్తున్నాము అన్న మాట . ఒక గుర్తింపు వస్తువు లేదా అనుభూతి అసలైన స్వరూపాన్ని అనుభవం లోకి తీసుకుని రాదు మనం ఒక పువ్వు ను గులాబీ అని , చేమంతి అని పిలుస్తున్నాము అంటే గులాబీ , చేమంతి లక్షణాలని వాటి లో అన్వేషిస్తాము . అలా పేరు ఇవ్వకుండా పువ్వు ను మనం చూడాలి అంటాడు . సరిగా ఇదే భాష కాక పోయినా ఇదే భావం .
స్త్రీ పురుషుల మధ్య ఉండే బంధానికి ఏ పేరును ఇచ్చినా అంతకుముందే ఆ బంధాలకు మనం ఇచ్చిన లక్షణాలను మనం ఇచ్చిన పేరు లో వెతుక్కుంటాము .
అది శృగారమా అమలిన శృగారమా . లేక ప్రేమా , లేక స్నేహమా , లేక మరొకటా అనేది .
నిజానికి ఈ తండ్లాటా ఎప్పుడూ ఉండేదే .
ఇంతకుముందే వివాహ బంధం లో వుండే ధర్మాన్ని కాపాడటం అనే సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఒక నవ్య సంప్రదాయాన్ని రాయప్రోలు సృష్టించాడు . ప్రేమ ను స్నేహం గా మార్చేయమన్నాడు
ఉత్తర రామ చరిత్ర లో భవభూతి కరుణ రస మొక్కటే రసమని చెపుతూ ఆ రసమొక్కటే అవస్థా బేధంతో అనేక రస రూపాలను ధరిస్తుంది అని చెప్పినట్టు గా
రాయప్రోలు శృంగారమొక్కటే అవస్థా బేధం తో పలు రసాలుగా మారుతుందనారు
ఈ ప్రయత్నం లో స్నేహాన్ని , వాత్సల్యాన్ని శృంగార శాఖలు గా పరిగణించారు
తృణకంకణము లో కథానాయకను చదువుతుంటే గురజాడ కాసులు కూడా గుర్తుకు వస్తుంది . కాసులు , తృణకంకణ నాయక ఒకే నాణేనికి రెండు వైపులు
తెలుగు సాహిత్యానికి భావకవిత్వం మంచి చేసిందో , చెడు చేసిందో నాకు తెలియదు కానీ స్త్రీ ని ఒక ఉన్నత స్థానం లో చూసే దృష్టిని పురుషుడికి ఇచ్చింది .
ఆమె నవనీత హృదయ
నా ఆశా పథాన్త రాల నవ పారిజాతమ్ము
అంటూ స్త్రీ ని కుసుమ కోమలం గా సంభావించే సంస్కారం నేర్పింది
దాదాపు డెబ్బై ఏళ్ళ తరువాత ఇప్పుడు నిన్ను కోరి , అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూస్తున్నప్పుడు , కొత్త తరం యువకులతో , కలసి వాళ్ళ ఆంతరంగిక వేదనలను గమనిస్తున్నప్పుడు
మళ్ళీ తృణ కంకణం లాంటి కావ్యం వస్తే బావుంటుంది అనిపిస్తోంది .
ఈ కాలానికి తృణకంకణం ఎందుకు ? తృణ కంకణం ధరించిన చేతికి ఎప్పుడూ బాధ కలుగనీయదు . చేతి కి అనుగుణం గా ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఇన్ని నీళ్లు చిలకరిస్తే చాలు . పచ్చపచ్చ గా మారి అందం గా ఆహ్లాదంగా పరిమళిస్తుంది . మనిషి కి ప్రేమ కూడా అలాగే ఉండాలి . అది హృదయాన్ని గాయపర్చకూడదు . హృదయాన్ని తేజోవంతం చేయాలి . హృదయాన్ని పరిమళ భరితం చేయాలి . ప్రేమను ఇతరేతర అంశాలనుండి విముక్తం చేయాలి .
ఇప్పటి తరానికి నిజమైన ప్రేమ తప్పిస్తే మిగతా అంశాలు అన్నీ తెలుసు . వాటి అన్నిటి నుండి ప్రేమను విముక్తం చేసి ప్రేమను అనుభవైకవేద్యం చేయాలంటే
ఇలాంటి కావ్యాలు మళ్ళీ రావాలి . కానీ రాశేవారు ఏరి ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి