19, సెప్టెంబర్ 2017, మంగళవారం

కవిత్వ ప్రపంచం

నా యవ్వన వన వనమాలి శ్రీశ్రీ
ప్రపంచమొక పద్మ వ్యూహం 
కవిత్వమొక తీరని దాహం
అన్నాడు శ్రీ శ్రీ . ప్రపంచమొక పద్మవ్యూహం అవునో కాదో నాకు తెలియదు కానీ కవిత్వం మాత్రం తీరని దాహమే . ఎంత చదివినా , ఎంత రాసినా , ఎంత సేపు ఆ ఆనుభవిక ప్రపంచం లో విహరించినా తనివి తీరదు .నా యవ్వన వనం లోకి కొత్త గాలిలా వచ్చినవాడు శ్రీశ్రీ .
నేను ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్ తీసుకున్నాను . అప్పుడు రెండు విద్యార్థి ఆర్గనైజేషన్స్ బాగా యాక్టీవ్ గా ఉండేవి . ఒకటి ఎస్ ఎఫ్ ఐ . రెండవది పి .డి .ఎస్ యు . కొత్త గా చేరిన విద్యార్థులను పార్టీ లో చేర్చుకోవడానికి అవి ప్రయత్నం చేసేవి . క్లాస్ కి క్లాస్ కి మధ్య విరామ సమయం లో వచ్చి తమ పార్టీల గురించి చెప్పి సభ్యత్వం ఇచ్చేవి . అలా ఒక క్లాస్ విరామ సమయం లో ఎం . పుల్లయ్య అనే మా సీనియర్ క్లాస్ కి వచ్చి ఆకలి రాజ్యం సినిమా లోని సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాట పాడాడు . ఈ పాట ఎవరు రాశారు అని అడిగితే శ్రీ శ్రీ అని చెప్పాడు . నిజానికి ఆ పాట శ్రీశ్రీ కాదు ఆత్రేయ రాసింది . అందరి లాగే శ్రీశ్రీ అని పుల్లయ్య కూడా భ్రమపడి నట్టున్నాడు . అలా ఆత్రేయ పాట ద్వారా శ్రీశ్రీ నాకు పరిచయం అయ్యాడు . శ్రీశ్రీ కవిత్వం తో నా ప్రయాణం ఇంకా కొనసాగుతూ వున్నది
శ్రీ శ్రీ అంటే చాలామందికి మహాప్రస్థానమే . దాన్ని మాత్రమే చదివి శ్రీ శ్రీ తమకు రక్త మజ్జాస్థిగతమ్ అయ్యాడు అనుకుంటారు చాలామంది . శ్రీ శ్రీ సాహిత్యం తో సుదీర్ఘ ప్రయాణం చేసిన వాళ్లకి ఒక విషయం స్పష్టం గా అర్ధమౌతుంది . మహాప్రస్థానానికి ముందు శ్రీశ్రీ వేరు . మహాప్రస్థానం శ్రీశ్రీ వేరు . మహాప్రస్థానం తరువాత శ్రీశ్రీ వేరు . మొత్తం మూడు దశలు శ్రీశ్రీ సాహిత్య జీవితం లో . ఆ మూడు దశలు తెలుగు కవిత్వం లో చెరగని అడుగుజాడలు . చిత్రం గా రెండో దశ లోని మహాప్రస్థానం మొదటి మూడవ దశలను పూర్తిగా ఓవర్లాప్ చేసి శ్రీ శ్రీ అంటే మహాప్రస్థానమే అనేటట్టు చేసింది . అది శ్రీశ్రీ మిగతా కవిత్వానికి రావలసిన పేరు రాకుండా చేసింది . అది ఖడ్గ సృష్టికీ , మరోప్రపంచానికి జరిగిన అన్యాయం .
శ్రీశ్రీ భావకవిగా కవిత్వయాత్ర ప్రారంభించి , అభ్యుదయ కవిగా దారి వేసుకుని , విప్లవకవిగా తనను తాను మల్చుకుని ప్రజా కవిగా చిరస్మరణీయుడు అయ్యాడు .
శ్రీశ్రీ కవిగా కళ్ళు తెరిచే నాటికి రాయప్రోలు , దేవులపల్లి కృష్ణశాస్త్రి , విశ్వనాధ ల ప్రభ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతున్నది .ప్రేయసీ పయోధరాల భావకవిత్వ బ్లాక్ హోల్ కవిత్వం అని కలవరించిన ప్రతి ఒక్కరినీ తనలోకి లాగి వేసుకుంటున్నది
తన ఎనిమిదేళ్ల వయసులోనే శ్రీశ్రీ ఒక కందపద్యం రాసి తండ్రికి చూపిస్తే వాటిలో ఛందస్సు లేదని సులక్షణ సారం , అప్పకవీయం నేర్పించాడట .ఆ ఊపు లో శ్రీ శ్రీ
ప్రభవ లాంటి పద్యకావ్యాలు రాశాడు .
వివిధ సూన వితాన శోభిత కుజప్ర
శస్త సుమప్రదావన స్థలము సాంద్ర
చంద్రికా సముజ్జ్వల దివ్యశర్వరీ ప్ర
శాంత వేళ సమంచిత సౌఖ్య మొసగె
అని పౌర్ణమి నాటి రాత్రి తనలో కలిగించిన రసోజ్వల హాయిని రజనీ గానము అనే కవిత్వ ఖండిక లో శ్రీశ్రీ ప్రస్తుతించారు . ఈ పద్యం శ్రీశ్రీ అది చెప్తే తప్ప చాలామందికి తెలియదు ,. ఏ రాయప్రోలో , దేవులపల్లో రాశారు అని అనుకుంటారు . కానీ శ్రీశ్రీ కవిత్వం రాయడం మొదలు పెట్టింది ఏ విశ్వనాధ కో , రాయప్రోలుకో నీడ గా ఉండటానికి కాదు . కాలం కడుపుతో ఉండీ అతడిని కన్నది భావకవిగా నవ పల్లవాధరాల మీద తేనే లేఖలు రాయడానికి కాదు .
తరువాత ఎప్పుడో తాను రాయవలసిన ఫిరంగి లో జ్వరం ధ్వనించే మృదంగ ధ్వానం 1930 లోనే శ్రీశ్రీ కి అరవైమూడు రోజులు టైఫాయిడ్ జ్వరం తో చేసిన పోరాటం లో అనుభవం లోకి వచ్చింది . విశ్వనాథను , రాయప్రోలు బాటను వదిలి తనదయిన మార్గం కోసం పరితపించాడు .
నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
అన్న జయభేరి 1933 లో ఒక ఉప్పెన లా తెలుగు కవిత్వలోకాన్ని ముంచెత్తింది . తెలుగు కవిత్వం లో అది ఒక స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ . గురజాడ వేసిన మార్గం నుండి ఒకింత పక్కకు తొలగిన కవిత్వాన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించిన సందర్భం .
శ్రీశ్రీ ప్రస్థానం లో రెండో దశ మొదలు అయిన సన్నివేశం . ప్రపంచం బాధను తన బాధ గా తెలుగుకవి సొంతం చేసుకున్న సమయం . గమనించవలసిన విషయం ఏమిటంటే వస్తువు మారింది . రూపం మారింది . మారనిది ఒకటుంది . భాష
మహాప్రస్థానం అంతా పురాణ ప్రతీకల్తో శ్రీశ్రీ పాఠకుడిని విస్మయ పరుస్తాడు . వస్తువును , రూపాన్ని మార్చుకున్న శ్రీశ్రీ భాషను ఎందుకు మార్చుకోలేదు
తారా నివహపు ప్రేమ సమాగమం లో
సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వాన్నీ
శ్రీ శ్రీ ఎందుకు వదిలించుకోలేక పోయాడు ..
అమోఘమై , అగాధమై , అచింత్యమై , అమేయమై
ఏకాంతమై , ఏకైకమై ,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవమై
బ్రహ్మానుభవమ్ కలిగించిన
తనను కరిగించిన కవనఘృణీ
రమణీ
కవిత
కు కొత్త భాషను ఎందుకు ఇవ్వలేక పోయాడు ?
నాకు అనిపించేదేమిటంటే సంప్రదాయం అతడిని పూర్తిగా వదిలి పెట్టకపోవడం వలన . సంప్రదాయం పునాదుల మీద శ్రీశ్రీ మహాప్రస్థానమనే పెద్ద భవనాన్ని నిర్మించాడు .
తన మరో ప్రపంచం గీతం లోని ఛందస్సుకు భజగోవిందం శ్లోకాల ఛందస్సు మూలమైతే , వాటికి విష్ణు సహస్ర నామాలు మూలం . సంప్రదాయం కూడా కాలం తో మారుతూ ఉంటుంది . అది నిలువ నీరు కాదు . నిరంతర ప్రవాహం . అందుకేనేమో
ఆ తరువాత శ్రీశ్రీ
ఆరుద్రా చూశావా తమాషా
సంప్రదాయం నిలిచే ఉంటుంది హమేషా
అని చమత్కరించాడు .
బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్నె లు కాదు ఇప్పుడు కావలసింది
రాబందుల రెక్కల చప్పుడు
పొగగొట్టాపు భూంకారధ్వని
అరణ్యమున హరేంద్రఘర్జన
పయోధర ప్రచండ ఘోషం
ఖడ్గమృగోదగ్ర విరావం
ఝామఝానిలా షడ్జా ధ్వానం
కావాలోయి నవకవనానికి
అని నినదించాడు
ఇంతటి సంస్కృత పద గుంఫనం , సుదీర్ఘ సమాస అలంకరణం శ్రీశ్రీ కి అలవోకగా పట్టుబడిందా ? సులక్షణ సారమూ , అప్పకవీయ ప్రభావమా
ఛందస్సుల సర్ప పరిశ్వంగం నుండి కవిత్వాన్ని విముక్తం చేస్తాను అన్న కవి ఆ పని తన ఖడ్గసృష్టి లో , మరో ప్రపంచం లో పూర్తిగా చేశాడు
మాటలకు విలువ లేదు . వాటిని పేర్చినప్పుడు వాటికి కొంత విలువ వస్తుంది అన్నాడు శ్రీశ్రీ . పేర్చడం అంటే ఏమిటి ?
కవిత్వం లో ఏ పదం , ఏ మాట ఎక్కడ ఉండాలో అక్కడ ఉండటం అన్న మాట . వాక్యం లో పదాల స్తానం శ్రీశ్రీ కి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదేమో. అలాగే ఆ పదాలను తాత్విక అర్ధం లో ప్రయోగించడం లో కూడా
మానవుడా అనే కవిత లో శ్రీశ్రీ శరీరపరీవృతుడా అని ఒక పదాన్ని ప్రయోగిస్తాడు
వేగుంట మోహన ప్రసాద్ మాస్టారు తన కరచాలనం లో ఈ పదప్రయోగం గురించి కొంత చర్చ చేశారు .
మానవుడా అనే గేయం లో ఒక చిత్రమైన పదం వున్నది శరీర పరీవృతుడా అన్నది
ఏమిటి దీని అర్ధం ? శరీరం పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది . అలాంటప్పుడు శరీరపరీవృతుడా అని మనిషిని సంబోధించడం ఎందుకు ? శ్రీశ్రీ అవగాహనలో మనిషి శరీరం కంటే భిన్నమైన వాడు . మానవునికి శరీరాతీతమైన ఒక ఆంతరంగిక వ్యక్తిత్వం వుంది . అంతర్దృష్టి ఉంది . వివేకము విజ్ఞానము అభివృద్ధి చెందని కాలంలో దీన్ని జీవుడని ఆత్మా అని అనివుండవచ్చు . కానీ ఈనాడు అనర్ధక పదాలు విసర్జించి మానవుని వ్యక్తిత్వాన్ని మనం అర్ధం చేసుకుంటున్నాము . ఇక్కడ శరీర పరీవృతుడు అన్నమాటకి శరీరచ్చాదితుడని కావచ్చు లేదు శరీర పరిసర్పితుడని కావచ్చు . తాత్విక చిత్తవృత్తి కల వాళ్లకు , ఆ చిత్తవృత్తి పైకొన్నప్పుడు తమ శరీరమే తమకు గుదిబండ అయి నట్టు అనిపిస్తుంది . శ్రీ శ్రీ ఉద్దేశించినది ఇదేనని కచ్చితంగా చెప్పలేము . కానీ తాను శరీరం కంటే భిన్నం అనే ఒక భావాన్ని మానవునికి అనుభవం చేశే ఒక చిత్తవృత్తిని శ్రీశ్రీ సూచిస్తున్నాడని చెప్పవచ్చు , ఈ అనుభూతి ఆలోచనాపరులకు కాక ఈ తాత్విక చిత్తవృత్తి కల వాళ్లకు మాత్రమే కలుగుతుంది . శరీరం పట్ల ఎలాంటి మమకారం లేక పోవడం దానిని ఒక పరాయి వస్తువుగా చూడటం మనం రమణ మహర్షి లో చూడవచ్చు .
వేగుంట మాస్టారు కవిత్వం లో వాచ్యార్ధానికి , లోలోపలి వ్యంగ్య అర్ధానికి మధ్య చాలా తేడా ఉంటుంది అని చెపుతూ ఫై శ్రీశ్రీ పదాన్ని వివరించారు . నిజానికి శ్రీశ్రీ
మహాప్రస్థానం అంతా కనిపించే వాచ్యార్థం కంటే కనిపించని వ్యంగ్య అర్ధమే ఎక్కువగా ఉంటుంది . తెలుసుకోగలిగిన పాఠకుడికి తెలుసుకున్నంత
శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాల రచన పూర్తి అయిన తరువాత తెలుగుదేశం లో అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భవించింది . సహజం గానే శ్రీశ్రీ దానికి అధ్యక్షుడు
విశాఖ విద్యార్థుల సవాలు రచయితలారా మీరెటువైపుకి స్పందించిన శ్రీశ్రీ విరసం అధ్యక్షుడైనాడు . ఆ తరువాత మరోప్రపంచం వచ్చింది ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న రోగం ఎదో నేను మహాప్రస్థానం లో కనుగొంటే దానికి విరుగుడు నేను మరోప్రపంచం లో కనుగొన్నాను అన్నాడు శ్రీశ్రీ
విప్లవం యాడుందిరో
ఆడనే నీ కూడుందిరో
ఆడనే నీ గూడుందిరా
గోడుగోడుమని ఏడుస్తావుంటే
యాడు నీ వొంక రాడింకా రా
అని మరోప్రపంచం లో కర్తవ్య బోధ చేశాడు . ప్రభావ నాటి గ్రాధిక భాషకి , మహాప్రస్థానం నాటి పౌరాణిక భాషకి మరోప్రపంచం నాటి జన భాషకి తేడా మనకు తేలికగా అర్ధమౌతుంది . ఇది కేవలం శ్రీశ్రీ భాషలో వచ్చిన మార్పు కాదు . సమాజం లో మొత్తంగా మెల్లమెల్ల గా వచ్చిన మార్పు .
శ్రీశ్రీ కవిత్వమే కాదు . ఒసే తువ్వాలు అందుకో లాంటి కధలు , సినిమా పాటలు చాలా రాశాడు . అయినా శ్రీశ్రీ అంటే మహాప్రస్థానమే
ఒక కవిని మొదటినుండి చివరివరకు చదివితే చాలు ఒక సమాజ గమనాన్ని చదివినట్టే
చెప్పుకోతగిన ఒక్క కవీ మన కృష్ణశాస్త్రి -ఉన్నత హిమాలయ శిఖరాలలో కురిసిన కవితా వర్షం పాయలై దేశాల వెంట ప్రవహించి చివరకు సైడు కాలువల్లో పలుకుతున్న సమయాన తన భీషణాతప జ్వాలలతో ఆవిరి పొగలు ఆకాశమార్గాన విహరింపజేసి రక్షించాడు అంటాడు చలం
ఎవరినుంచి దొంగిలించామో వారిని క్షమించడం కష్టం . నిజమే శ్రీశ్రీ నుండి నేను ఏమి దొంగిలించలేదు . అయినా శ్రీశ్రీ ని క్షమించను . క్షమిస్తూ వెళితే చాలా వాటికి శ్రీశ్రీ ని క్షమించాలి . శ్రీశ్రీ ని ఎందుకు క్షమించకూడదో సిప్రాలి చదివితే తెలుస్తుంది
శ్రీశ్రీ కవిత్వాన్ని ప్రేమించండి . అది ప్రేమ నెత్తురు కలగలసిన కాక్టైల్ లా నిషా కలిగిస్తుంది . మన మనోమాలిన్యాలను శుభ్రపరచి నిత్యనూతనం గా తయారు చేస్తుంది . మనుషులుగా మనలను నిలబెడుతుంది .
మనిషిని తద్వారా సమాజాన్ని trnsform చేయడం కంటే కవిత్వం సాధించగలిగిన గొప్ప లక్ష్యం మరేదయినా ఉన్నదా ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి