13, నవంబర్ 2009, శుక్రవారం

వాడి నిద్ర

వాడికి మూడేళ్లు
అచ్చం నా లాగే నడుస్తాడు
నా లాగే నవ్వుతాడు
నాన్న స్టాంపు అంటుంది వాళ్ళ అమ్మ
కాని పగలంతా అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతాడు వాడు
అమ్మ నడుం మీద కాలు
వాడి నోట్లో కుడి బొటన వేలు
వాడి నిద్రకు కావలసిన సరంజామా

వాడి తల మీద చెయ్యి వేసి
నిమరాలనుకుంటాను
నోట్లో వేలు తీసి
పక్కన పెట్టలనుకుంటాను.
తల నిమరలేను
వేలు తీసి పక్కన పెట్ట లేను
వాడలా నిద్ర పోతుంటే
వెదురు పూల పొదరింట్లో పరిమళ మేదో అరమోడ్పు కన్నులినట్టు వుంటుంది
లేలేత ఆకు పచ్చటి పోతిల్లలో
ఒత్చిగిల్లిన గుమ్మడి పువ్వు లాగా వుంటుంది

మా ఆవిడ మధ్య రాత్రి బద్దకంగా నన్ను లేపి
" వాడిని తీసుకెళ్ళి పాస్ పోయించండి
లేక పోతే పక్క తదిపెస్తాడు" అంటుంది
నా కా నిద్రా ముద్రిత సౌందర్యాన్ని
ముట్టుకోవాల్ని వుండదు
కాటుక చీకటి లాంటి కృష్ణ కుంతలాల మధ్య చిక్కి
అలసి సొలసి పరుండిన మల్లె పువ్వును కదిలించలనుండదు
మా సంభాషణ వింటాడో ఏమో తెలీదు కాని
అమ్మంటే భయమో నాన్నంటే అనునయమో వూహించలేను కాని
మేమిద్దరమూ గాఢ నిద్రలో వుండగా
వాడు నా పక్కలో దూరి
నన్ను తడిపేసి
అమ్మ కౌగిట్లో వెచ్చగా బజ్జుంటాడు.

1 కామెంట్‌: